: అద్వానీ మనసులో ఏముంది? రాజీనామా ఉపసంహరించుకుంటారా?
ఉక్కుమనిషి అద్వానీ మనసులో ఏముంది? అసలు ఆయన రాజీనామా చేయాల్సిన అగత్యం ఏమిటి? అద్వానీకి పార్టీపై పట్టు సడలుతోందా? పార్టీకి తన అవసరం లేదనుకున్నారా? అసలు అద్వానీ సాబ్ నిన్నమొన్నటి వరకూ రాష్ట్రాలను పర్యటించి, ఇప్పుడు ఒక్కసారిగా బాంబు పేల్చడం వెనుక కారణమేంటి? అద్వానీ నిర్ణయం వెనుక ఉన్న అసలు కోణమేంటి?
అద్వానీ ఉక్కు మనిషి. జనసంఘ్ నుంచి పార్టీని వేరు చేయడం నుంచీ బీజేపీని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తయారు చేయడంలో అద్వానీ ప్రధమ, ప్రధాన పాత్ర పోషించారు. వాడైన పదజాలంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసారు. ఆ దశలోనే గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పార్టీని ఉచ్ఛ స్థితికి తీసుకువెళ్లారు. నాయకత్వ ఎంపికతోపాటు పార్టీ కీలక నిర్ణయాలలో తనదైన ముద్ర ఉండేలా ఆయన చూసుకున్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా తానే అధికార కేంద్రంగా ఉండేలా కార్యక్రమాలు చక్కదిద్దుకున్నారు. అప్పట్లో మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ వంటి నేతలంతా అద్వానీ మాట జవదాటకుండా ఉండేవారు.
అయితే, ద్వితీయశ్రేణి నాయకత్వం ఊహించిన దానికంటే వేగంగా ఎదిగింది. అద్వానీ అంచనాలను మించి పార్టీ విస్తరించింది. ఇందులో అద్వానీ బుద్ది కుశలత ఉన్నా అంతకంటే ఎక్కువగా ప్రాంతీయ నేతలు తమ ప్రాభవాన్ని పెంచుకోవడం మొదలు పెట్టారు. వారిలో అందరికంటే మోడీ ముందంజలో ఉన్నారు. గుజరాత్ అల్లర్లకు ప్రధాన కారకుడు అన్న ఆరోపణల స్థాయి నుంచి గుజరాత్ ను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేసిన వ్యక్తిగా మన్ననలందుకున్నారు. దీంతో దేశప్రధాని పదవికి అర్హుడు, గాంథీల కుంటుంబానికి ప్రధాన ప్రత్యర్థిగా మోడీ పేరొందారు. దీంతో అసలు మోడీ దేశానికి నాయకత్వం వహించగల వ్యక్తా? కాదా? అన్న అంశాలపై అద్వానీకి కొన్ని అనుమానాలు అలానే ఉండిపోయాయి.
అగ్రనేత అద్వానీని మోడీ దూకుడులో మించిపోయాడు. ఇదే అద్వానీ సాబ్ కి మింగుడుపడలేదు. ఈ దూకుడు అన్ని విషయాల్లో ఉండడం దేశానికి ఇబ్బందిగా పరిణమిస్తుందేమోనన్న శంక ఆయనకు పట్టుకుంది. వాజ్ పేయి మాటల్లో పదును, చెణుకులు ఉన్నా, విషయ సాధనలో ఆయన అమోఘమైన నేర్పరి. మాటజారకుండా పనులు చక్కబెట్టేవారు. అంతటి సామర్థ్యం మోడీకి లేదనేది అద్వానీ వాదన. అందుకే గత కొంత కాలంగా మోడీకి ప్రత్యామ్నాయంగా ఛవాన్ వంటి వారిని వెనకేసుకొచ్చారు. మోడీ కంటే జనాకర్షక నేత పార్టీలో లేరనే అభిప్రాయాన్ని అద్వానీ నిర్ధ్వందంగా తోసిపుచ్చేవారు. కానీ, పార్టీ మోడీపై ఎనలేని నమ్మకాన్ని ప్రదర్శించడంతో కాస్త అసహనానికి గురయ్యారు.
మరికొంత మంది బీజేపీ నేతలు లోపాయికారీగా అసలు అద్వానీకే ప్రధాని పదవి అధిష్ఠించాలన్న కోరిక ఉందని, అందుకే మోడీని ప్రధాని పదవి అభ్యర్ధిగా ప్రకటించకుండా అడ్డుకుంటున్నారని గుసగుసలాడుతున్నారు. ఉక్కు మనిషి ప్రధాని పదవికి సమర్ధుడైనా ఈ జనరేషన్ ను అందుకోగలరా? అన్నది సొంత పార్టీ నుంచే ఎదురౌతున్న ప్రధాన ప్రశ్న. దీంతో సహజంగా వెనకేసుకొచ్చే ఆర్ఎస్ఎస్ కూడా అద్వానీజీకి మద్దతు ప్రకటించడం లేదు. మరో వైపు ఆర్ఎస్ఎస్ కి, అద్వానీకి మధ్య సంబంధాలు మరీ అంత గొప్పగా ఏం లేవన్నది ఓ వర్గం వాదన. అదీకాక, అద్వానీ 'వృద్ధనేత' అనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారని, యువభారత్ ను నడిపించాలంటే పాతతరం నాయకత్వం సఫలీకృతం కాలేదని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఏతావాతా అద్వానీ నాయకత్వాన్ని సొంత పార్టీలోని నేతలే అంగీకరించని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు పార్టీలో మోడీ 'కీ రోల్' పోషించడం మొదలు పెడితే ఆర్ఎస్ఎస్ తో పాటూ మరికొన్ని వర్గాలు పార్టీపై ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంటుందని, తమ లాంటి సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఉండదనే ఆలోచన అద్వానీని రాజీనామాకు ఉసిగొల్పిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ పాత్ర, ప్రాధాన్యతను మోడీకి గుర్తుచేసేందుకే అద్వానీ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని కూడా అభిప్రాయపడుతున్నారు. అద్వానీ మనసులో మాట బయటపడేదెలా అన్నది ఇప్పుడు మహా ఉద్దండులకు కూడా అంతుపట్టడం లేదు. ఇంతకూ ఉక్కుమనిషి పార్టీ నుంచి బయటపడతాడా? లేదా? అన్నది లోగుట్టు పెరుమాళ్లు కెరుక!