rg kar medical college: మరోసారి వార్తల్లో ఆర్జీకర్ కళాశాల.. వైద్య విద్యార్ధిని ఆత్మహత్య

rg kar medical college student suicide in kolkata

  • పశ్చిమ బెంగాల్ కోల్‌కతా సమీపంలోని కమర్‌హతిలోని ఈఎస్ఐ క్వార్టర్స్‌లో ఘటన
  • మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి
  • అనారోగ్య సమస్యలతో డిప్రెషన్‌కు గురై బలవన్మరణం
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఘటనతో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాల అండ్ హాస్పటల్ పేరు వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కళాశాలలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కమర్‌హతిలోని ఈఎస్ఐ క్వార్టర్స్‌లో గల తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని తల్లి క్వార్టర్స్ తలుపులు పలుమార్లు తట్టినా ఎలాంటి స్పందన రాకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి చూడగా, కుమార్తె ఉరి వేసుకుని కనిపించింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను స్థానికుల సహాయంతో దగ్గరలోని ఈఎస్ఐ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కుమర్‌హతి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో పరిశీలించగా ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదవి తెలిపారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, కానీ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, సదరు విద్యార్థిని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతోందని, ఆ కారణంగా డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 

  • Loading...

More Telugu News