Thandel: తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీకాకుళం మత్స్యకారులు.. వీడియో ఇదిగో!

- మత్స్యలేశంలో మత్స్యకారులను కలిశాకే వారి జీవితం గురించి తెలిసిందన్న నాగచైతన్య
- తన దృష్టిలో వారే నిజమైన హీరోలని ప్రశంస
- సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిజమైన రాక్‌స్టార్ అని ప్రశంస
- అల్లు అరవింద్ తనను కూతురిలా భావిస్తారన్న సాయి పల్లవి
హైదరాబాద్‌లో గత రాత్రి జరిగిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీకాకుళం మత్స్యకారులు సందడి చేశారు. నటుడు నాగచైతన్య శ్రీకాకుళం మత్స్యకారులను వేదికపైకి పిలిచారు. డైరెక్టర్ చందు తనను మత్స్యలేశం తీసుకెళ్లాడని, అక్కడ మత్స్యకారులను కలిశాకే తనకు వారి జీవితం గురించి, వారు ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలిసిందని పేర్కొన్నారు. ఆ తర్వాతే తండేల్ రాజు కథపై తనకు ఒక స్పష్టత వచ్చిందని వివరించారు. వారిలో అసలు భయం అనేది కనిపించలేదని, తన దృష్టిలో నిజమైన హీరోలు వారేనని, వారు లేకుంటే తండేల్ మూవీ ఉండేది కాదని అన్నారు.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ నిజమైన రాక్‌స్టార్ అని, బుజ్జితల్లి పాట ఈ మూవీ స్వరూపాన్నే మార్చేసిందని నాగచైతన్య పేర్కొన్నారు. సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లడంలో ఈ పాట బాగా ఉపయోగపడిందన్నారు. విరూపాక్ష సినిమా చూసిన తర్వాత డీవోపీ శ్యామ్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రతో కలిసి పనిచేస్తే బాగుంటుందని చందూతో చెప్పానని, ఇప్పుడు వారితో కలిసి పని చేసినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం యాస తనకు సవాళ్లతో కూడిన పాత్ర అని, ఈ విషయంలో డైరెక్టర్ టీం తనకు ఎంతో సాయం చేసిందని నాగచైతన్య తెలిపారు.
ఈవెంట్‌లో నటి సాయిపల్లవి మాట్లాడుతూ.. నిర్మాత అల్లు అరవింద్ తనను కుమార్తెలా భావిస్తారని అన్నారు. అల్లు అరవింద్, బన్నీ వాసు సినిమాను ఎంతో బలంగా నమ్ముతారని పేర్కొన్నారు. నాగ చైతన్య తండేల్ సినిమాకు ముందు, ఆ తర్వాత ఎంతో మారారని, తెలుగు ఆడియన్స్ ఆయనను ఎంతో ప్రేమిస్తారని చెప్పుకొచ్చారు.