Thandel: తండేల్ ఈవెంట్‌కు బన్నీ డుమ్మా.. కారణం చెప్పిన అల్లు అరవింద్

- హైదరాబాద్‌లో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ప్రత్యేక అతిథిగా అల్లు అర్జున్ వస్తారని ప్రచారం
- చివరి నిమిషంలో గైర్హాజరు కావడంపై అల్లు అరవింద్ వివరణ
- గీతా ఆర్ట్స్‌కు తన దృష్టిలో ఎప్పుడూ అగ్రస్థానమేనన్న నాగ చైతన్య
- సినిమాలో తండేల్ రాజు జీవితానికి, తన జీవితానికి మధ్య ఎంతో వ్యత్యాసముందన్న నటుడు
- నటి సాయిపల్లవి పట్ల ఇంతటి అభిమానాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదన్న నాగ చైతన్య
హైదరాబాద్‌లో గత రాత్రి జరిగిన ‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకపోవడానికి గల కారణాన్ని ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. తీవ్రమైన గ్యాస్ సమస్య కారణంగా అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడని వివరణ ఇచ్చారు. నాగ చైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘తండేల్’ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు.
ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ.. తండేల్ మూవీ చివరి దశలో తనకు భయం ప్రారంభమైందని అన్నారు. చిత్ర నిర్మాణంలో అల్లు అరవింద్, బన్నీవాసు ఎంతో సహకరిస్తారని తెలిపారు. తన దృష్టిలో గీతా ఆర్ట్స్‌కు ఎప్పుడూ అగ్రస్థానమేనని పేర్కొన్నారు. తండేల్ గురించి బన్సీవాసు 10 నిమిషాలు చెప్పారని, అప్పుడే ఈ సినిమాపై ఎంతో ఆసక్తి ఏర్పడిందని పేర్కొన్నారు.
సినిమాలో తండేల్ రాజుకు, తన జీవితానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని నాగచైతన్య పేర్కొన్నారు. ఆ పాత్రలోకి మారేందుకు చందు తనకు కావాల్సినంత సమయం ఇచ్చాడని తెలిపారు. చందు కాంబినేషన్‌లో తనకు ఇది మూడో సినిమా అని పేర్కొన్నారు. నటి సాయిపల్లవి పట్ల ఇంతటి అభిమానాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ మధ్య కాలంలో ఒక ఆర్టిస్టు పట్ల ఇంత ఏకపక్షంగా వ్యవహరించిన ధోరణిని ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులోనూ చూడబోమని అన్నారు. నిజంగా ఇందుకు సాయిపల్లవి అర్హురాలని నాగచైతన్య పేర్కొన్నారు.