Team India: అభిషేక్ శర్మ సెంచరీ విధ్వంసం... టీమిండియా భారీ స్కోరు

- ముంబయిలో టీమిండియా × ఇంగ్లండ్
- ఐదో టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసిన టీమిండియా
- 54 బంతుల్లో 135 పరుగులు చేసి అభిషేక్ శర్మ
- 7 ఫోర్లు, 13 సిక్సర్లతో విరుచుకుపడిన యువ ఓపెనర్
యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సుడిగాలి సెంచరీ సాయంతో టీమిండియా ఐదో టీ20లో భారీ స్కోరు నమోదు చేసింది. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఈ చివరి టీ20లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది.
టీమిండియా ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగే హైలైట్ గా నిలిచింది. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 13 భారీ సిక్సులు ఉన్నాయి. క్రీజులో ఉన్నంత సేపు అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 37 బంతుల్లోనే 100 పరుగులు చేసి టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఈ డైనమిక్ బ్యాటర్... దూకుడుగా ఆడే ప్రయత్నంలో లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
ఇక టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ సంజూ శాంసన్ 16, తిలక్ వర్మ 24, శివమ్ దూబే 30, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు. శివమ్ దూబే 13 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సులతో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ ఉడ్ 2, జోఫ్రా ఆర్చర్ 1, జేమీ ఒవెర్టన్ 1, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు.
అనంతరం, 248 పరుగుల భారీ లక్ష్యఛేదన ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆ జట్టు 2 ఓవర్లలోనే 23 పరుగులు చేసింది. ఆ 23 పరుగులు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒక్కడే కొట్టాడు. అయితే, మూడో ఓవర్లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బ్రేక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ను షమీ అవుట్ చేయడంతో టీమిండియా శిబిరంలో ఉత్సాహం నెలకొంది.