ICC Under-19 Women's Worldcup: టీమిండియా అమ్మాయిలు వరల్డ్ కప్ గెలవడంపై చంద్రబాబు, లోకేశ్ స్పందన

- అండర్-19 మహిళల వరల్డ్ కప్ విజేత టీమిండియా
- అభినందనలు తెలియజేసిన చంద్రబాబు, లోకేశ్
- జాతి గర్వించేలా చేశారంటూ కితాబు
- బాలికలకు స్ఫూర్తిగా నిలిచారని వెల్లడి
టీమిండియా అమ్మాయిలు వరుసగా రెండోసారి ఐసీసీ అండర్-19 టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకోవడం పట్ల భారత్ లో సంబరాలు చేసుకుంటున్నారు. జాతి గర్వించేలా చేశారంటూ టీమిండియా అమ్మాయిల జట్టుపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా భారత జట్టు అద్భుతమైన ఘనత పట్ల హర్షం వ్యక్తం చేశారు.
"టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్-19 అమ్మాయిల జట్టుకు అభినందనలు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో మీ కఠోర శ్రమ, పట్టుదల, దృఢ సంకల్పంతో 9 వికెట్ల తేడాతో ఘనతర విజయం సాధించారు. తద్వారా ప్రతి భారతీయుడు గర్వించేలా చేశారు. దేశానికి పేరు తీసుకురావడం మాత్రమే కాదు, లెక్కలేనంతమంది బాలికలకు ప్రేరణగా నిలిచారు. యావత్ దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
త్రిష అందరికీ గర్వకారణంలా నిలిచారు: నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, డిఫెండింగ్ చాంపియన్ గా టోర్నీలో అడుగుపెట్టి రెండోసారి కూడా మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. సమష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని లోకేశ్ కొనియాడారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అందరికీ గర్వకారణంలా నిలిచారని కితాబిచ్చారు. భారత మహిళల జట్టు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.