Gongadi Trisha: ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్... అవార్డులన్నీ మన త్రిషకే!

Gongadi Trisha bags Player Of The Match and Player Of The Tournament awards in ICC Under19 World Cup

  • ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ విజేత టీమిండియా
  • ఫైనల్లో త్రిష ఆల్ రౌండ్ నైపుణ్యం
  • బౌలింగ్ లో 3 వికెట్లు తీసి, బ్యాటింగ్ లో 44 పరుగులు చేసిన త్రిష
  • భారత జట్టు విజయంలో కీలకపాత్ర 
  • ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును తండ్రికి అంకితం ఇస్తున్నానని వెల్లడి

తెలుగమ్మాయి గొంగడి త్రిష ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించింది. టీమిండియా టైటిల్ విన్నర్ గా నిలవడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. ఇవాళ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో త్రిష 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడమే కాకుండా... ఛేజింగ్ లో 33 బంతుల్లోనే అజేయంగా 44 పరుగులు చేసి వావ్ అనిపించింది. 

త్రిష ఆల్ రౌండ్ నైపుణ్యం ఆమెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డునే కాదు... ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా అందించింది. ఈ వరల్డ్ కప్ లో త్రిష మొత్తం 309 పరుగులు చేసింది. బౌలింగ్ లో 7 వికెట్లు తీసి సత్తా చాటింది. అంతేకాదు, ఈ టోర్నమెంట్ లో నమోదైన ఏకైక సెంచరీ సాధించింది కూడా మన త్రిషనే. 

ఇవాళ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గ్రహీత, భారత మహిళల జట్టు మాజీ క్రికెటర్ నీతూ డేవిడ్ చేతుల మీదుగా త్రిష ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ... ఈ అవార్డును తన తండ్రికి అంకితం ఇస్తున్నానని ప్రకటించింది. తనను తాను ఎప్పుడూ ఆల్ రౌండర్ గానే భావిస్తానని పేర్కొంది. జాతీయ జట్టు తరఫున మరిన్ని మ్యాచ్ లు ఆడి, దేశం కోసం మరిన్ని విజయాలు సాధించాలనేదే తన గోల్ అని త్రిష వెల్లడించింది.

రెండేళ్ల వయసులోనే బ్యాట్ పట్టి...
త్రిష స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం. రెండేళ్ల వయసుకే బ్యాట్ పట్టిన త్రిష... 9 ఏళ్ల వయసుకే హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఎంపికై సత్తా చాటింది. ఆ తర్వాత అండర్-23 కేటగిరీలోనూ ఆడింది. బౌలింగ్ లో స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లను తికమకపెట్టే త్రిష... బ్యాటింగ్ కు దిగితే భారీ షాట్లతో మోత మోగిస్తుంది.

  • Loading...

More Telugu News