Congress Mlas: ఎమ్మెల్యేల రహస్య భేటీపై అనిరుధ్ రెడ్డి ఏమన్నారంటే..?

- సమావేశం నిజమే కానీ రహస్యం అంటూ ఏమీలేదని వివరణ
- నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించుకున్నామని వెల్లడి
- పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిని కలుస్తామని చెప్పిన ఎమ్మెల్యే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది రహస్యంగా సమావేశమయ్యారనే వార్త శనివారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సమావేశానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వం వహించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. ‘ఎమ్మెల్యేలం సమావేశమైన మాట వాస్తవమే కానీ అందులో రహస్యం ఏమీ లేదు’ అని వివరణ ఇచ్చారు. రహస్యంగా భేటీ కావాల్సిన అవసరమూ తమకు లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఆదివారం ఓ మీడియా సంస్థతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు.
రెవెన్యూ మంత్రి వద్ద తాను ఏ ఫైలు కూడా పెట్టలేదని తేల్చిచెప్పారు. నేను పెట్టానని చెబుతున్న ఫైల్ ఏంటో ఆయనే (నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి) చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్పేముందని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. అయితే, పార్టీ అధిష్ఠానానికి చెప్పాల్సింది చాలానే ఉందని వ్యాఖ్యానించారు. త్వరలో పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని వివరించారు.
నిధుల కేటాయింపులో అన్యాయం..
ప్రభుత్వం నిధుల కేటాయింపులో తమకు అన్యాయం చేస్తోందని కొంతమంది ఎమ్మెల్యేలు వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రులు ఉన్న నియోజకవర్గాలకే నిధులు వెళుతున్నాయి తప్ప తమ నియోజకవర్గాలకు రావడంలేదని మండిపడుతున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన టీపీసీసీ సారథి మహేశ్ కుమార్ గౌడ్.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఫోన్ చేశారని, అది కేవలం లంచ్ మీటింగ్ మాత్రమేనని అనిరుధ్ రెడ్డి వివరణ ఇచ్చారని పార్టీ వర్గాల సమాచారం.