Baba Ramdev: బాబా రాందేవ్ పై అరెస్ట్ వారెంట్.. కారణం ఇదే!

Kerala Court Issues Non Bailable Arrest Warrant On Ramdev Baba

  • పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపైనా జారీ
  • తప్పుడు ప్రకటనల కేసులో కోర్టు ఆదేశాలు
  • ఈ నెల 15న మరోసారి కేసు విచారించనున్న కేరళ కోర్టు

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పై కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బాబా రాందేవ్ సహచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ పైనా వారెంట్ ఇష్యూ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అవాస్తవాలను ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కేరళ డ్రగ్ ఇన్ స్పెక్టర్ వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పాలక్కాడ్ కోర్టు బాబా రాందేవ్ కు, ఆచార్య బాలకృష్ణకు గతంలో నోటీసులు పంపించింది.

ఈ నెల 1న విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. అయితే, శనివారం జరిగిన విచారణకు వారిద్దరూ హాజరుకాలేదు. దీంతో వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసును ఫిబ్రవరి 15న విచారిస్తామని చెబుతూ వాయిదా వేసింది. కాగా, పతంజలి అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీకి చెందిన పది ఉత్పత్తులపై ప్రభుత్వం గతంలోనే వేటు వేసింది. ఆ ఉత్పత్తులకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో విడుదల చేసిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ వాటి తయారీ లైసెన్స్ ను రద్దు చేసింది.

  • Loading...

More Telugu News