whatsapp: వాట్సాప్ ద్వారా బస్సు టికెట్ల రిజర్వేషన్ .. ఆర్టీసీ అధికారులకు కీలక ఆదేశాలు

- అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్ బుకింగ్ సదుపాయం
- వాట్సాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులను ఆనుమతించాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులు
- క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూర ప్రాంత బస్సు సర్వీసులన్నింటిలో వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్‌కు అవకాశం కల్పించారు. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది.
వాట్సాప్ ద్వారా టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే ?
బస్సు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు వాట్సాప్ ద్వారా 9552300009 నంబర్‌కు ముందుగా 'హాయ్' అని సందేశం పంపాలి. వెంటనే అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్/రద్దు అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటి వివరాలు నమోదు చేస్తే .. అందుబాటులో ఉన్న సర్వీసులను చూపిస్తుంది. వాటిలో సీట్లు ఎంపిక చేసుకుని ఆన్‌లైన్ లేదా డిజిటల్ చెల్లింపులు చేయాలి. వెంటనే బుక్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నంబర్‌కు టికెట్ వస్తుంది. వాట్సాప్‌లో వచ్చిన టికెట్‌ను చూపి ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణించవచ్చు.