Pawan Kalyan: కేంద్ర బడ్జెట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన

- వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం
- బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్టు పవన్ వెల్లడి
- వికసిత భారత్ వైపు నడిపించేలా ఉందని కితాబు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. మహిళా సాధికారత, యువత, రైతులు, మధ్య తరగతి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపకల్పన చేసినట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటున్న వికసిత్ భారత్ దిశగా నడిపించేలా ఈ బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ అవసరాల కంటే దేశం, దేశ ప్రజలు ముఖ్యమని నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ద్వారా చాటి చెప్పారని వివరించారు.
ఏపీకి ప్రధాని మోదీ ఇస్తున్న సహకారం కేంద్ర బడ్జెట్‌లోనూ కొనసాగించారని పవన్ కల్యాణ్ కొనియాడారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం వల్ల, ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే అవకాశం లభిస్తుందని వెల్లడించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమకు బడ్జెట్ లో రూ.3,295 కోట్లు కేటాయించారని, తద్వారా ప్లాంట్ పరిరక్షణకు మోదీ సర్కారు కట్టుబడి ఉందన్న విషయం స్పష్టమైందని పవన్ కల్యాణ్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన అవశాలను సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందని పేర్కొన్నారు.
ఇక, రూ.12 లక్షల ఆదాయం వరకు ఆదాయ పన్ను మినహాయింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పవన్ తెలిపారు. ఇటువంటి నిర్ణయాలు మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయని వివరించారు.