Mallu Ravi: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రచారంపై స్పందించిన మల్లు రవి

- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్లో భేటీ అయినట్లు ప్రచారం
- జడ్చర్ల ఎమ్మెల్యే విందు ఇచ్చారన్న మల్లు రవి
- ఎమ్మెల్యేలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి స్పందించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను ఓ హోటల్‌లో విందుకు ఆహ్వానించారని తెలిపారు. ఈ విందు సందర్భంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలు అంశాలపై చర్చించారని చెప్పారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారంటూ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న జరిగిన ఈ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కె. రాజేశ్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో సహా పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.