K Kavitha: తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది: కవిత

- బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్న కవిత
- కాంగ్రెస్ తన అసమర్థతను చాటుకుందని విమర్శ
- సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదన్న కవిత
తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆమె స్పందిస్తూ, తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు రాష్ట్రం నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ, రాష్ట్రానికి సాధించింది మాత్రం ఏమీ లేదని అన్నారు. తెలంగాణకు నిధులు తీసుకురావడంలో కాంగ్రెస్ తన అసమర్థతను చాటుకుందని ఆమె మండిపడ్డారు.
తెలంగాణకు సంబంధించి ఒక్క అంశానికి కూడా బడ్జెట్‌లో కేటాయింపులు జరపలేదని కవిత విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని, సమ్మక్క - సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 1.50 లక్షల కోట్ల మేర వడ్డీలేని రుణాలు ఇస్తామని కేంద్రం చెప్పిందని, అందులో తెలంగాణకు వచ్చేలా చూడాలని రేవంత్ రెడ్డికి ఆమె సూచించారు.
సుదీర్ఘ డిమాండ్ అయిన ఐఐఎం ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని కవిత అన్నారు. ఉపాధి హామీకి నిధులు పెంచలేదని విమర్శించారు. రైతాంగం, మహిళా సాధికారత, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని ఆమె విమర్శించారు. విద్యా రంగానికి కేవలం 2.5 శాతం అరకొర నిధులు కేటాయించారని అన్నారు. విద్యా రంగానికి కనీసం ఆరు శాతం నిధులు కేటాయించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు
పసుపు బోర్డును ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న బీజేపీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తరహాలోనే పని చేసే స్పైసెస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించిన కేంద్రం, పసుపు బోర్డుకు మాత్రం పైసా కేటాయించలేదని అన్నారు. పసుపు బోర్డుకు నిధులు కేటాయించకపోవడం ద్వారా నిజామాబాద్ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని కవిత మండిపడ్డారు.