G. Kishan Reddy: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులపై ప్రశ్న... కిషన్ రెడ్డి సమాధానం ఇదే

Kishan Reddy on Union Budget

  • తెలంగాణకు ఏమిచ్చారని కొంతమంది అడుగుతున్నారన్న కిషన్ రెడ్డి
  • ఇది కేంద్ర బడ్జెట్... రాష్ట్ర బడ్జెట్ కాదన్న కిషన్ రెడ్డి
  • కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణకు భాగస్వామ్యం ఉంటుందని వ్యాఖ్య

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమిచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారని, కానీ ఇది రాష్ట్ర బడ్జెట్ కాదని గుర్తించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఇది పేద ప్రజల డ్రీమ్ బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు జరిగే ప్రయోజనాలను వివరించారు. ఈ బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు.

పేదలు, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్ ఇది అని ఆయన అన్నారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్నును మినహాయించి మోదీ ప్రభుత్వం మధ్య తరగతి వారికి గొప్ప ఊరటనిచ్చిందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వేసిన మొదటి అడుగు ఇది అన్నారు.

తెలంగాణకు ఏమిచ్చారని అడిగేందుకు ఇది కేవలం రాష్ట్ర బడ్జెట్ కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణకు భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఎంఎస్ఎంఈలకు బడ్జెట్‌లో రూ. 1.50 లక్షల కోట్లు కేటాయించారని, ఇందులో తెలంగాణకు కూడా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. స్టార్టప్ కంపెనీలకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారని, దీని ద్వారా తెలంగాణ స్టార్టప్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలతో తెలంగాణకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏ సంస్కరణ తీసుకొచ్చినా దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. అర్బన్ స్టేట్‌గా ఉన్న తెలంగాణకు రూ.10 వేల కోట్లు రానున్నాయని తెలిపారు. అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి లబ్ధి చేకూరుతోందని ఆయన పేర్కొన్నారు.

G. Kishan Reddy
BJP
Telangana
  • Loading...

More Telugu News