Thandel: 'తండేల్' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే...!

- నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో 'తండేల్'
- మొదట ఇవాళ్టి సాయంత్రం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ అంటూ ప్రకటన
- తాజాగా రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఎక్స్ వేదికగా మేకర్స్ వెల్లడి
- ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరెక్కకిన చిత్రం 'తండేల్'. ఫిబ్రవరి 7న మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది.
అయితే, ఈ వేడుకను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. రేపు (ఆదివారం) నిర్వహిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. "ది ఐకానిక్ తండేల్ జాతరను రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈవెంట్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ పాలి యాట గురితప్పేదే లేదేస్" అంటూ పోస్ట్ పెట్టింది. కాగా, ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రానున్నారు.
ఇక ఇప్పటికే చిత్ర బృందం ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. విశాఖపట్నంలో ఇటీవల ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన టీమ్.. శుక్రవారం నాడు ముంబయిలో హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే గురువారం నాడు చెన్నైలో నిర్వహించిన వేడుకలో మేకర్స్ తమిళ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.