Bandi Sanjay: వేతన జీవుల ఖాతాల్లో కోతలు, వాతల్లేవ్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్: బండి సంజయ్

Bandi Sanjay responds on Union Budget

  • వేతన జీవుల బంగారు భవితకు ప్రణాళికలు మాత్రమే ఉంటాయన్న బండి సంజయ్
  • ఇది పద్దు మాత్రమే కాదు... ప్రతి కుటుంబంలో సంతోషాల పొద్దు అని కితాబు
  • దేశంలోని ప్రతి ఒక్కరి కలను సాకారం చేసేలా బడ్జెట్ ఉందని వెల్లడి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రూ.12 లక్షల ఆదాయం వరకు ఇక పన్ను లేదని పేర్కొన్నారు. వేతన జీవుల ఖాతాల్లో ఇక కోతలు, వాతలు ఉండవని, వారి బంగారు భవితకు ప్రణాళికలు మాత్రమే ఉంటాయని తెలిపారు.

ఇది కేవలం పద్దు కాదని, ప్రతి భారతీయ కుటుంబంలో సంతోషాల పొద్దు అని పేర్కొన్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో చిరునవ్వులు, వేతన జీవుల ముఖాల్లో సంతోషపు వెలుగులు నింపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతీయులందరి తరఫునా కృతజ్ఞతలు అంటూ ఆయన పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే కాదని, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత్ భారత్ కు ఒక రోడ్ మ్యాప్ అని ఆయన మరో ట్వీట్ చేశారు.

రైతు సంక్షేమం నుంచి మధ్యతరగతికి ఉపశమనం వరకు, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం నుంచి స్టార్టప్‌లకు ప్రోత్సాహం వరకు, మౌలిక సదుపాయాల కల్పన నుండి పెట్టుబడులను ప్రోత్సహించడం వరకు, ఈ బడ్జెట్ దేశంలోని ప్రతి ఒక్కరి కలను సాకారం చేసే దిశగా సాగిందని పేర్కొన్నారు.

సాహసోపేతమైన, సమ్మిళిత, భవిష్యత్తుకు బంగారు బాట పరిచేలా ఉన్న బడ్జెట్‌ను రూపొందించినందుకు ప్రధానమంత్రి మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దేశ ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలిపారు.

Bandi Sanjay
BJP
Union Budget
Telangana
  • Loading...

More Telugu News