Kerala High Court: పార్టీ మారితే రాజీనామా చేయాలి: కేరళ హైకోర్టు

- సర్వసాధారణంగా మారిపోయిన పార్టీ ఫిరాయింపులు
- రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలన్న కేరళ హైకోర్టు
- రాజీనామా చేయకపోవడం ప్రజాతీర్పును అవమానించినట్టేనని వ్యాఖ్య
రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయించడం సర్వసాధారణ విషయమే. స్వలాభం కోసమో, కేసుల నుంచి బయటపడటం కోసమో లేదా ఇతర కారణాల వల్లనో పార్టీలు మారుతుంటారు. ఈ పార్టీ ఫిరాయింపులపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారాలనుకునే ప్రజాప్రతినిధులు ముందుగా పదవికి రాజీనామా చేయాలని... రాజీనామా చేసిన తర్వాత నిర్వహించే ఎన్నికల్లో గెలిచి చూపించాలని వ్యాఖ్యానించింది. అప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం ఉంటుందని తెలిపింది.
ప్రజల మద్దతుతో ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారినప్పటికీ... పదవికి రాజీనామా చేయకపోవడం ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపుదారులను గెలిపించాలో? లేక ఓడించాలో? ప్రజలకు బాగా తెలుసని చెప్పింది. ప్రజాస్వామ్యానికి ఉన్న గౌరవం ఇదేనని తెలిపింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.