Harshit Rana: నాలుగో టీ20లో హర్షిత్ రాణా కంక‌ష‌న్‌పై వివాదం.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

Harshit Ranas Concussion Substitution Sparks Controversy

  • పుణేలో ఇంగ్లండ్, భార‌త్ మ‌ధ్య‌ నాలుగో టీ20
  • దూబే స్థానంలో కంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌గా హ‌ర్షిత్ రాణా
  • అరంగేట్ర మ్యాచ్ లోనే 3 వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన పేస‌ర్‌ 
  • ఆల్‌రౌండ‌ర్ స్థానంలో బౌల‌ర్‌ను కంక‌ష‌న్‌గా తీసుకోవ‌డం ప‌ట్ల ఇంగ్లండ్ అసంతృప్తి

పుణే వేదిక‌గా ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో భార‌త జ‌ట్టు ఘ‌న‌ విజయం సాధించింది. ఈ విజ‌యంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో గాయ‌ప‌డిన‌ శివ‌మ్ దూబే స్థానంలో హ‌ర్షిత్ రాణా కంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌గా బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. 

ఇదే అత‌నికి భార‌త్ త‌ర‌ఫున తొలి టీ20 మ్యాచ్ కూడా. ఇలా అరంగేట్ర మ్యాచ్ లోనే మ‌నోడు కీల‌క స‌మ‌యంలో 3 వికెట్లు ప‌డ‌గొట్టి టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే, శివమ్ దూబేకు బదులుగా హర్షిత్‌ ను కంకషన్ స‌బ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడం పట్ల ఇంగ్లండ్ మాజీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

కంకషన్ స‌బ్‌స్టిట్యూట్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ ఆట‌గాడు కంక‌ష‌న్‌కు గురైన‌ప్పుడు రీప్లేస్‌మెంట్‌ గా అత‌డిలాంటి ఆట‌గాడినే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, నిన్న రాణా పూర్తి బౌల‌ర్ కాగా, దూబే అప్పుడ‌ప్పుడూ బౌలింగ్ చేసే బ్యాట‌ర్ కావ‌డంతో దుమారానికి దారితీసింది. 

ఇదే విష‌య‌మై  ఇంగ్లీష్ జ‌ట్టు కెప్టెన్ జోస్ బట్లర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు స‌మాచారం. ఫీల్డ్‌ అంపైర్లతో మాట్లాడినప్పటికీ ఫలితం మాత్రం ఇండియాకు అనుకూలంగా వచ్చింది. దీంతో మ్యాచ్‌ తర్వాత బట్లర్ ఈ విషయంపై స్పందించాడు. 

"ఈ రిప్లేస్‌మెంట్‌ ఏ మాత్రం సరైంది కాదు. మేం దీంతో అస్సలు ఏకీభవించట్లేదు. మాతో వాళ్లు ఏ మాత్రం సంప్రదించలేదు. నేను బ్యాటింగ్‌ కు వచ్చిన సమయంలో హర్షిత్ ఎందుకు ఫీల్డింగ్‌లో ఉన్నాడు? అని అడిగాను. దానికి వాళ్లు కంకషన్ స‌బ్‌స్టిట్యూట్ అని బదులిచ్చారు. మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనిపై జవగళ్ శ్రీనాథ్‌ ను క్లారిటీ ఇవ్వాలని అడుగుతాం" అని బ‌ట్ల‌ర్ పేర్కొన్నాడు.

ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!
కంకషన్ స‌బ్‌స్టిట్యూట్ రూల్స్ ప్రకారం ఒకరికి బదులు మరొకరిని ఆడేందుకు మాత్రమే అనుమతించ‌వ‌చ్చు. అయితే, బ్యాటర్‌ స్థానంలో బ్యాటర్ లేదా బౌలర్‌ స్థానంలో బౌలర్‌ లేదా ఆల్ రౌండర్‌ స్థానంలో ఆల్ రౌండర్‌కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. 

ఏదైనా జట్టు కోరిక మేరకు ఐసీసీ రిఫరీ ఈ రీప్లేస్మెంట్‌ కు అనుమతించాల్సి ఉంటుంది. అతడిదే తుది నిర్ణయం కూడా అవుతుంది. అయితే, దీనిపై ప్రత్యర్థి జట్టుకు అప్పీలు చేసేందుకు ఏ మాత్రం హక్కు ఉండదు. కానీ, నిన్న‌టి మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ అయిన దూబే స్థానంలో పేస్ బౌల‌ర్ అయిన హ‌ర్షిత్ రాణాను తీసుకోవ‌డంతో వివాదానికి కార‌ణ‌మైంది. 

  • Loading...

More Telugu News