Kerala: టాయిలెట్ సీటును నాకించి.. ఫ్లష్‌లో తలను ముంచి దారుణం.. అవమానం భరించలేక విద్యార్థి ఆత్మహత్య

- కేరళలోని ఎర్నాకుళం జిల్లా త్రిప్పునితురలో ఘటన
- తల్లిదండ్రుల విచారణలో అసలు విషయం వెలుగులోకి
- చనిపోయిన తర్వాత కూడా వదలని ర్యాగింగ్ గ్యాంగ్
- విద్యార్థి మరణాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉన్న స్క్రీన్‌షాట్‌ను బయటపెట్టిన బాధిత తల్లిదండ్రులు
- సాక్ష్యాలు లేకుండా చర్యలు తీసుకోలేమన్న గ్లోబల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం
కేరళలో దారుణం జరిగింది. ర్యాగింగ్ పేరుతో 15 ఏళ్ల కుర్రాడిపై తోటి విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారు. ఈ అవమానాన్ని భరించలేని బాలుడు భవనంలోని 26వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా త్రిప్పునితురలో జనవరి 15న జరిగిందీ ఘటన.
తన కుమారుడిపై జరిగిన దారుణాన్ని కుర్రాడు మిహిర్ తల్లి రాజ్నా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. మిహిర్‌ను కొట్టారని, దుర్భాషలాడారని, అతడి చివరి రోజున ఊహించలేని అవమానాన్ని ఎదుర్కొన్నాడని తెలిపారు. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి టాయిలెట్ సీటును నాకించారని, టాయిలెట్‌ను ఫ్లష్ చేసి తలని అందులో పెట్టారని పేర్కొన్నారు. వీటిని అతడు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
మిహిర్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చిందో తెలుసుకునేందుకు రాజ్నా, ఆమె భర్త ప్రయత్నించారు. ఈ క్రమంలో సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. స్నేహితులు, స్కూల్‌లోని సహచరులతో మాట్లాడారు. ఈ క్రమంలో అతడి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడంతో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. పాఠశాలలోను, స్కూల్ బస్సులోనూ మిహిర్.. ర్యాగింగ్ గ్యాంగ్ క్రూరమైన చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు గురయ్యాడని తెలిపారు.
ముఠా అక్కడితో ఆగిపోలేదని, అతడి శరీర రంగును కూడా లక్ష్యంగా చేసుకుని వేధించారని రాజ్నా తెలిపారు. మిహిర్ మరణం తర్వాత కూడా వేధింపులు ఆగలేదని చెబుతూ కొన్ని స్క్రీన్ షాట్లను పంచుకున్నారు. అందులో ‘ఎఫ్‌కే నిగ్గా నిజంగా మరణించాడు’ అని ఉంది. ఇది వారి క్రూరత్వాన్ని వెల్లడిస్తుందని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడి మరణాన్ని కూడా వారు సెలబ్రేట్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కుమారుడి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి, డీజీపీకి బాధిత తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. తాము సేకరించిన సాక్ష్యాధారాలతో తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని వేడుకున్నారు. పోలీసులు ఆలస్యం చేసేకొద్దీ తాము సేకరించిన సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో త్రిప్పునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
కాగా, మిహిర్ తల్లి ఆరోపణలను గ్లోబల్ పబ్లిక్ స్కూల్ (జీపీఎస్) ఖండించింది. ర్యాగింగ్, బెదిరింపు ఆరోపణలకు పాఠశాల లక్ష్యం కావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. స్కూల్‌లో తాము ఇలాంటి వాటిని సహించబోమని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.