Revanth Reddy: బీజేపీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్ కాలనీ అని పేరు పెడతా: రేవంత్ రెడ్డి

Revanth Reddy says will name Gaddar colony where the bjp office is there

  • గద్దర్‌ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదన్న ముఖ్యమంత్రి
  • గద్దర్‌ను గేటు బయట నిలబెట్టిన వారు ఇప్పుడు అధికారం కోల్పోయారన్న ముఖ్యమంత్రి
  • ఒంటరిననే భావన వస్తే గద్దర్ వద్దకు వెళ్లి సలహాలు తీసుకునే వాడినన్న రేవంత్ రెడ్డి

బీజేపీ కార్యాలయం ఉన్న కాలనీ పేరును గద్దర్ కాలనీగా మారుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. "నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మరొక్కసారి మీరు, మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరును పెడతాను. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేలా చేస్తాను బిడ్డా" అని బీజేపీని, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అవార్డులు తమ వద్ద ఉన్నాయని బీజేపీ భావిస్తుందేమో కానీ, మీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉందని గుర్తుంచుకోవాలన్నారు. అందుకే మీ పార్టీ ఉన్న కాలనీకి గద్దరన్న పేరును పెడతానని వ్యాఖ్యానించారు.

ఇంతకుముందు, అధికారంలో ఉన్న వారు గద్దర్‌ను గేటు బయట నిలబెట్టారని, కానీ ఇప్పుడు ఆయన గద్దె కూలిపోయిందని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు గద్దరన్న వారసుడు అధికారంలో ఉన్నాడని, గద్దరన్నను గేటు బయట నిలబెట్టిన వ్యక్తి బయట ఉన్నాడని వ్యాఖ్యానించారు. గద్దరన్నను గేటు బయట కూర్చోబెట్టిన వారికి ఏ గతి పట్టిందో గద్దరన్నను విమర్శించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.

గద్దర్ వద్దకు వెళ్లి సలహాలు తీసుకునేవాడిని

రాజకీయంగా ఒంటరిని అనే భావన వచ్చినప్పుడల్లా తాను గద్దర్ వద్దకు వెళ్లి సలహాలు తీసుకునేవాడినని రేవంత్ రెడ్డి అన్నారు. తుది శ్వాస వరకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం గద్దర్ జీవించారని కొనియాడారు. గద్దర్, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, జయధీర్ తరుమలరావు, అందెశ్రీకి పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేశామన్నారు.

పక్కన ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు వచ్చాయని, వాళ్లకంటే తాము ప్రతిపాదించిన వారు ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. కేంద్రం చేసిన తప్పును సరిదిద్దుకుంటారని తాను లేఖ రాశానని, కానీ గద్దర్‌కు అవార్డు ఇచ్చేది లేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News