Uttar Pradesh: కుంభమేళా రద్దీ... కాశీలో ఫిబ్రవరి 5 వరకు గంగాహారతి నిలిపివేత

- కుంభమేళాకు తరలివస్తున్న భక్తులు
- భక్తులతో కిటకిటలాడుతున్న వారణాసి
- అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గంగాహారతి నిలిపివేస్తున్నట్లు వెల్లడి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. నిత్యం కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానమాచరిస్తున్నారు. కాశీలోనూ రద్దీ పెరిగింది. వారణాసి ఘాట్‌ల వద్ద రద్దీ కనిపిస్తుండటంతో కొన్ని రోజుల పాటు ఇక్కడ గంగాహారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తుల రద్దీ దృష్ట్యా వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ తదితర ఘాట్‌లలో నిర్వహించే గంగాహారతిని ఫిబ్రవరి 5 వరకు నిలిపివేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఘాట్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ అన్నారు.
ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన భక్తులు వారణాసికి పెద్దసంఖ్యలో వస్తున్నారని, దీంతో కొంతమంది వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్‌లలో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మౌని అమావాస్య రోజున కాశీలో భక్తుల రద్దీ పెరిగిందని, వారి సంఖ్య తగ్గేవరకూ ఎవరూ వారణాసికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.