Raja Singh: గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం... రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి

- ఆసుపత్రి నిర్మాణంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారన్న రాజాసింగ్
- పాత ఆసుపత్రి వద్దే భవన నిర్మాణానికి తగిన స్థలం ఉందన్న రాజాసింగ్
- కొత్త ఆసుపత్రి నిర్మాణాన్ని మైదానం చుట్టుపక్కల వారు వ్యతిరేకిస్తున్నారని వెల్లడి
గోషామహల్ నియోజకవర్గంలో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తే ఇబ్బందులు కలుగుతాయని నియోజకవర్గ ప్రజలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని గోషామహల్ శాసనసభ్యుడు, బీజేపీ నేత రాజాసింగ్ అన్నారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడాన్ని స్థానికులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా వంటి వ్యాధులకు చికిత్స అందిస్తారని, ఈ క్రమంలో స్థానికులు వైరస్ వంటి వ్యాధుల పట్ల భయాందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. గోషామహల్ మైదానంలో నూతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శాసనసభలో తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. పాత ఆసుపత్రి వద్దే నూతన నిర్మాణానికి తగిన స్థలం ఉందని ఆయన తెలిపారు..
నూతన భవన నిర్మాణాన్ని మైదానం చుట్టూ ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారి ఆవేదనను ముఖ్యమంత్రి ఆలకించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలిపారు. ముఖ్యమంత్రి ఒకసారి స్థానికులతో మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.