Chandrababu: రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని చెప్పడంలేదు: సీఎం చంద్రబాబు

- కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు... నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
- రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచన
సీఎం చంద్రబాబు కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో, ఈ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి బలపరుస్తున్న అభ్యర్థులు రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ లను భారీ మెజారిటీ గెలిపించాలని తెలిపారు. ఏ ఎన్నిక వచ్చినా అధికార పక్షం గెలిచినప్పుడే రాష్ట్రంలో సుస్థిరపాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కొత్తగా వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని ఉద్బోధించారు. ఇచ్చిన హామీలపై కృషి చేయాల్సిన అవసరం ఉందని, అయితే రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడంలేదని నేతలతో అన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకుంటూనే హామీలు అమలు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, గాడి తప్పిన వ్యవస్థలను ఇప్పుడు చక్కదిద్దుతున్నామని చెప్పారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.