Anam Ramanarayana Reddy: ఇరిగేషన్ అధికారులపై ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం

- అమృతధార పథకం డీపీఆర్ ను సిద్ధం చేయడంలో విఫలమయ్యారన్న ఆనం
- హాఫ్ మైండ్ తో పని చేయవద్దని మండిపాటు
- వెంటనే సరైన డీపీఆర్ ఇవ్వాలని ఆదేశం
ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అమృతధార పథకం ద్వారా 46 మండలాల్లోని గ్రామాలకు తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ పథకం కోసం రూ. 8,400 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు. అయితే అమృతధార పథకం కోసం డీపీఆర్ లు సిద్ధం చేయడంలో ఇరిగేషన్ అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పష్టంగా లేని ప్రాజెక్ట్ రిపోర్టును ప్రభుత్వానికి అధికారులు ఇచ్చారని... ఇలాంటి ధోరణిని వెంటనే మార్చుకోవాలని అన్నారు. వెంటనే సరైన డీపీఆర్ ను ఇవ్వాలని చెప్పారు. హాఫ్ మైండ్ తో పని చేయవద్దని అన్నారు. అధికారులు ఇచ్చే రిపోర్ట్ పై రేపు తాను కేబినెట్ లో వివరించాల్సి ఉంటుందని చెప్పారు. సరిగ్గా లేని రిపోర్ట్ తో ప్రాజెక్ట్ పనులు మధ్యలోనే ఆగిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు.