health: చర్మం నల్లబడుతోందా...? కారణమిదే అంటున్న వైద్యులు!

complexion getting dark this health issue may be the reason

  • సాధారణంగా ఫెయిర్ గా ఉండేవారు కూడా ఉన్నట్టుండి నల్లబడే తీరు
  • దీనికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయంటున్న వైద్య నిపుణులు
  • త్వరగా గుర్తించి, జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచనలు

మంచి కాంతివంతమైన చర్మంతో ఉన్నవారు కూడా కొన్నిసార్లు ఉన్నట్టుండి నల్లబడిపోతుంటారు. చర్మం కళావిహీనమైపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ ఇబ్బంది అలాగే ఉంటుంది. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పనితీరుకు, మన చర్మం రంగు, ఆరోగ్యానికి లింక్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీనిని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే... నిగనిగలాడే, కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుందని వివరిస్తున్నారు.

చర్మానికి, జీర్ణ వ్యవస్థకు ఏమిటి లింకు?
మనం తినే ఆహారం నుంచి తగిన పోషకాలు శరీరానికి అందాలంటే... జీర్ణ వ్యవస్థలో ఆ ఆహారం బాగా జీర్ణం కావాలి, అదే సమయంలో పోషకాలన్నీ బాగా సంగ్రహించగలగాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మన మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందులోనూ ముఖ్యంగా చర్మంపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడమనేది... చర్మానికి సంబంధించిన చాలా సమస్యలకు దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు.

రంగు తగ్గిపోయి... కళ్ల కింద నల్లటి వలయాలతో...
జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకుంటే... శరీరంలో ఇన్ ఫ్లమేషన్ స్థితి తలెత్తుతుంది. ఇది చర్మాన్ని కళావిహీనం చేస్తుంది. చర్మం పొడిబారిపోతుంది. రంగు తగ్గిపోతుంది. ముడతలు పడటం ద్వారా వయసు ఎక్కువగా కనిపించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు... ఎసిడిటీ, గ్యాస్, ఇతర జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారిలో కళ్లకింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) ఎక్కువగా ఏర్పడతాయని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) అధ్యయనంలోనే తేలింది.

ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా, బాగా పనిచేసేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా పెరుగు వంటి ప్రొబయాటిక్స్ వినియోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడం, శరీరానికి తగిన వ్యాయమం, విశ్రాంతి, నిద్ర ఉండేలా చూసుకోవడం ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. వీటిని పాటిస్తే ఆరోగ్యవంతమైన జీర్ణ వ్యవస్థతోపాటు మంచి కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుందని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News