Sub Registrar Offices: ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద కిటకిట

- రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు
- గత కొన్ని రోజులుగా రిజిస్ట్రార్ కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు
- మొరాయిస్తున్న సర్వర్లు
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి నూతన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిమేర రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పాత ధరలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భారీగా తరలివస్తున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినప్పటి నుంచి ఇదే ఒరవడి కనిపిస్తోంది.
ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు, ఇతర రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారితో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.
ఒక్కసారిగా రద్దీ పెరగడంతో సర్వర్లు మొండికేస్తున్నాయి. దాంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిదానంగా సాగుతోంది. ఉదయం వచ్చిన వారు సాయంత్రం వరకు, ఒక్కోరోజు తర్వాత రోజు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.