Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను పొడిచిన నిందితుడిని ఫేషియల్ రికగ్నైజేషన్‌తో నిర్ధారించిన పోలీసులు

- ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు
- వీడియోలో ఉన్నది మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అని నిర్ధారించిన పోలీసులు
- దొంగతనం చేసే ఉద్దేశంతోనే నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడన్న పోలీసులు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని గుర్తించేందుకు ముంబై పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ సాంకేతికతను ఉపయోగించారు. నటుడి నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని ఈ సాంకేతికతతో విశ్లేషించారు. వీడియోలో ఉన్న వ్యక్తి నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన విచారణాధికారుల బృందం అక్కడ దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. అయితే, వాటిలో ఏవీ నిందితుడి వేలిముద్రలతో సరిపోలలేదని ఇటీవల కథనాలు వచ్చాయి.
నిందితుడు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడినట్లు పోలీసులు ఇదివరకే తెలిపారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.