Sonia Gandhi: రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ కామెంట్... బీజేపీ ఆగ్రహం

- ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి అలసిపోయారన్న సోనియా గాంధీ
- సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ ఎంపీ
- రాష్ట్రపతిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్న ఎంపీ
పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారని సోనియా కాస్తంత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రపతిపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ముర్ముపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ వంటి నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
ద్రౌపది ముర్ము ఆదివాసీ కుటుంబం నుండి వచ్చారని, ఆమె ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ జమీందారీ మనస్తత్వం ఆమె రాష్ట్రపతిగా ఉండటాన్ని అంగీకరించలేకపోతోందని విమర్శించారు. అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు.