Chandrababu: రాష్ట్రాన్ని చల్లగా చూడాలని వాసవీ మాతను కోరుకున్నా: సీఎం చంద్రబాబు

- ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి
- అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా పెనుగొండ ఆలయంలో సీఎం పూజలు
- ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని చల్లగా చూడాలని వాసవీ అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు.
పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. వాసవీ మాతను కొలిస్తే సుఖశాంతులు, ఐశ్వర్యం నిండుగా లభిస్తాయని చంద్రబాబు వివరించారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఆర్యవైశ్యుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్-2047తో ముందుకెళుతోందని అన్నారు. ఈ విజన్ సాకారం చేయడంలో ఆర్యవైశ్యులు ప్రధాన పాత్ర పోషించాలని చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు.