Virat Kohli: విరాట్ కోహ్లీ ఔట్.. నిమిషాల వ్యవధిలో స్టేడియం ఖాళీ.. ఇదిగో వీడియో!

- అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్, ఢిల్లీ జట్ల మధ్య రంజీ మ్యాచ్
- దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడిన విరాట్
- బ్యాటింగ్‌కి దిగి ఆరు రన్స్‌కే వెనుదిరిగిన రన్‌మెషీన్
- నిరాశతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన అభిమానులు
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడాడు. ఇటీవల ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న అతను మునుపటి ఫామ్ కోసం రంజీలు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్ ఇక్కడ కూడా నిరాశ పరిచాడు. 15 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 6 పరుగులే ఔట్ అయ్యాడు. దీంతో అతని కోసం మైదానానికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు నిరాశచెందారు.
విరాట్ బ్యాటింగ్ చూసేందుకు తండోపతండాలుగా స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్, అతను తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో నిరాశతో వెనుదిరిగారు. కోహ్లీ తర్వాత ఢిల్లీ బ్యాటర్లందరూ ఆడాలి. ఆ తర్వాత రైల్వేస్ జట్టు బ్యాటింగ్ ముగిశాకే రన్‌మెషీన్ మళ్లీ ఆడేందుకు అవకాశం ఉంటుంది. మ్యాచ్ నాలుగు రోజులే కావడం, ఈరోజు 2వ రోజు కావడంతో అది దాదాపు అసాధ్యం. అందుకే ప్రేక్షకులు కోహ్లీ ఔటైన తర్వాత స్టేడియం నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో అరుణ్ జైట్లీ స్టేడియం నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిపోయింది.
కాగా, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 241 రన్స్‌కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు 47 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుశ్ బదోనీ (70 నాటౌట్), మాథూర్ (36 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఢిల్లీ ఇంకా 47 పరుగులు వెనకబడి ఉంది.