Virat Kohli: రంజీలోనూ కోహ్లీది అదే తీరు... అభిమానుల నిరాశ

- అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్, ఢిల్లీ జట్ల మధ్య రంజీ మ్యాచ్
- 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ
- కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరిన రన్‌మెషీన్
- ఇక్కడ కూడా ఫెయిల్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ జట్టుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తరఫున టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఫామ్‌లేక ఇబ్బందులు పడుతున్న రన్‌మెషీన్ తిరిగి గాడిలో పడేందుకు రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అలాగే, బీసీసీఐ కూడా ఇటీవల జాతీయ జట్టులో ఆడే ప్రతి ప్లేయర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంటే రంజీ మ్యాచ్‌లు ఆడాలని సూచించింది.
ఈ నేపథ్యంలోనే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఢిల్లీ తరఫున విరాట్ రంజీ బరిలోకి దిగాడు. అయితే, ఇక్కడ కూడా నిరాశ పరిచాడు. 15 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. సాంగ్వాన్ విసిరిన చక్కటి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో అతని కోసం మైదానానికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు నిరాశచెందారు. నిన్నటి నుంచి అతని బ్యాటింగ్ చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. కోహ్లీ ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 241 రన్స్‌కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు 97 పరుగులకే కీలకమైన 4 వికెట్లు పారేసుకుంది.