Mali: బంగారు గనిలో కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతి

- పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ఘటన
- మృతుల్లో ఎక్కువ మంది మహిళలే
- గతేడాది ఇదే ప్రాంతంలో గని కుప్పకూలి 70 మందికిపైగా మృతి
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో విషాదం చోటుచేసుకుంది. కౌలికోరో ప్రాంతంలో బుధవారం బంగారు గనిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. గనిలో తవ్వకాలు జరుపుతుండగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు గల్లంతయ్యారు.
గనిలోకి బురద నీరు ప్రవేశించి కార్మికులను చుట్టుముట్టడంతోపాటు, కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారని గవర్నర్ కల్నల్ లామైన్ కపోరీ సనొగో తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా, గతేడాది జనవరిలో ఇదే ప్రాంతంలోని కంగబా జిల్లాలో బంగారు గని కూలిపోయిన ఘటనలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.