Donald Trump: జన్మతః పౌరసత్వాన్ని బానిసల పిల్లల కోసం తీసుకొస్తే.. ప్రపంచమంతా ఎగబడుతోంది: ట్రంప్

- బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనేదే జన్మతః పౌరసత్వం లక్ష్యమన్న ట్రంప్
- అర్హత లేని వాళ్లు కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శ
- దీనిపై సుప్రీంకోర్టుకు వెళతానని వెల్లడి
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతాకాలు చేశారు. ఇందులో జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేయడం ఒకటి. ఇది వివాదాస్పదం కావడంతో కోర్టు ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బానిసల పిల్లల కోసం తొలి నాళ్లలో జన్మతః పౌరసత్వం చట్టాన్ని తీసుకొచ్చారని ఆయన తెలిపారు. బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనేదే ఆ చట్టం ప్రాథమిక లక్ష్యమని చెప్పారు. అంతేకానీ, ప్రపంచం మొత్తం అమెరికా మీద పడిపోవడానికి కాదని అన్నారు. ఎంతో మంది అమెరికాకు వస్తున్నారని... అర్హత లేని వాళ్లు కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని... దీంతో, అర్హత లేని వ్యక్తుల పిల్లలకు ఇక్కడ పౌరసత్వం లభిస్తోందని చెప్పారు. ఎంతో గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిన జన్మతః పౌరసత్వం చట్టం దుర్వినియోగం అవుతోందని అన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళతానని చెప్పారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే విశ్వాసంతో ఉన్నానని తెలిపారు.
మరోవైపు, ఈ చట్ట ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా... అమెరికాలో జన్మించిన వారందరికి జన్మతః పౌరసత్వం లభిస్తుంది. ఈ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టుల్లో 5 దావాలు వేశాయి. వీటిలో సియాటిల్ లోని ఫెడరల్ కోర్టు తీర్పును వెలువరించింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న కోర్టు... ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా ఆపివేసింది.