Maha Kumbh Mela: ప్రేయసి ఇచ్చిన ఐడియాతో.. కుంభమేళాలో వేప పుల్లల విక్రయం.. వారం రోజుల్లో రూ. 40వేలు సంపాదించిన యువకుడు!

- కోట్లలో వస్తున్న భక్తులతో వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్న ప్రయాగ్‌రాజ్
- అక్కడికి వస్తున్న భక్తులకు వేప పుల్లలు అమ్ముతూ భారీగా సంపాదిస్తున్న యువకుడు
- పైసా పెట్టుబడి లేకుండా ఎంత దూరం నడిస్తే అంత ఎక్కువ గిరాకీ ఉంటుందని వ్యాఖ్య
- ఈ క్రెడిట్ మొత్తం తన గర్ల్‌ఫ్రెండ్‌కే చెందుతుందని వెల్లడి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువకుడి వీడియో
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈనెల 13 నుంచి మహా కుంభమేళా ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక కోట్లలో వస్తున్న భక్తులతో ప్రయాగ్‌రాజ్ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. కోట్లాది మంది వచ్చే మహా కుంభమేళాలో కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లుగా మారిపోయింది.
అక్కడికి వస్తున్న భక్తులకు ఓ యువకుడు వేప పుల్లలు అమ్ముతూ వారం రోజుల్లో ఏకంగా రూ. 40వేలు సంపాదించాడు. ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ అక్కడ పుల్లలు అమ్ముతున్న యువకుడిని ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రూపాయి పెట్టుబడి లేకుండా ఎంత దూరం నడిస్తే అంత ఎక్కువ గిరాకీ ఉంటుందని అతడు చెప్పాడు.
అయితే, ఈ క్రెడిట్ మొత్తం తన గర్ల్‌ఫ్రెండ్‌కే చెందుతుందని తెలిపాడు. ఆమె ఇచ్చిన ఐడియాతోనే తాను కుంభమేళాలో ఈ బిజినెస్ మొదలు పెట్టినట్టు పేర్కొన్నాడు. ఆ యువకుడి తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదర్శ్ తివారీ అనే యూజర్ షేర్ చేసిన ఈ వైరల్ వీడియోకు ఇప్పటికే 6 లక్షలకు పైగా లైక్స్ వచ్చి పడ్డాయి. చాలా మంది యువకుడి నిజాయితీని మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో అతని విజయం వెనుక అతని ప్రేయసి ఉందన్న విషయాన్ని కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇక 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళాలో బుధవారం నాటికే 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. సుమారు 40కోట్ల మంది వరకు భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, ఈ మహా కుంభమేళాలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలిరావడంతో సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం.