R Vaishali: పూలు, చాక్లెట్లు ఇచ్చి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ వైశాలికి క్షమాపణలు చెప్పిన ఉజ్బెక్ చెస్ ప్లేయర్.. వీడియో ఇదిగో!

- టాటా స్టీల్ చెస్ టోర్నీ సందర్భంగా వైశాలికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నోడిర్బెక్ నిరాకరణ
- అవమానంతో చేయి వెనక్కి తీసుకున్న వైశాలి
- వీడియో వైరల్ కావడంతో నోడిర్బెక్‌పై విమర్శలు
- తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చిన ఉజ్బెక్ గ్రాండ్ మాస్టర్
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ సందర్భంగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ నోడిర్బెక్ యకుబ్బోవ్ క్షమాపణలు తెలిపాడు. నిన్న పూలు, చాక్లెట్లతో వచ్చిన నోడిర్బెక్ వైశాలి తల్లి, సోదరుడు ఆర్. ప్రజ్ఞానంద ఎదురుగా వాటిని ఇచ్చి క్షమాపణలు తెలిపాడు.
వైశాలితో చేతులు కలిపేందుకు నిరాకరించిన ఉజ్బెక్ గ్రాండ్ మాస్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైశాలి, యకుబ్బోవ్ మధ్య జరిగిన నాలుగో రౌండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ కావడంతో వైశాలి తన చేయిని ముందుకు చాచింది. అయితే, ఆమెతో చేయి కలిపేందుకు నిరాకరించిన యకుబ్బోవ్ పావులు కదపడంలో బిజీగా మారిపోయాడు. దీంతో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ తన చేయిని వెనక్కి తీసుకుంది. వీడియో వైరల్ కావడంతో ఉజ్బెక్ ఆటగాడిపై విమర్శలు వెల్లువెత్తాయి.
గురువారం వైశాలికి పూలు, చాక్లెట్లు ఇచ్చి క్షమాపణలు తెలిపిన యకుబ్బోవ్ వివరణ ఇచ్చుకున్నాడు. ఇండియన్ చెస్ ఆటగాళ్లంటే తనకెంతో అభిమానమని, అయితే ఆ రోజు తొందరలో ఉండి అలా చేశానని పేర్కొన్నాడు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రవర్తనకు క్షమించాలని వేడుకున్నాడు. వైశాలి, ఆమె సోదరుడు ప్రజ్ఞానందకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. తనను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, ‘ఆల్ ది బెస్ట్’ అని యకుబ్బోవ్ చెబుతున్న వీడియోను ‘చెస్ బేస్ ఇండియా’ షేర్ చేసింది.
అతడి క్షమాపణపై వైశాలి స్పందించింది. అతడి క్షమాపణలను అంగీకరిస్తున్నట్టు తెలిపింది. అతడు ఆ రోజు అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం చేసుకున్నానని పేర్కొంది.