Dinesh Karthik: హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డ దినేశ్ కార్తీక్.. ధోనీ రికార్డు బ్రేక్!

- దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్
- పార్ల్ రాయల్స్ తరఫున బరిలోకి కార్తీక్
- జోబర్గ్ సూపర్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ (53)తో రాణించిన డీకే
- ఈ క్రమంలో విహాన్ లుబ్బే వేసిన ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సులు
- టీ20ల్లో ధోనీ (7,432 పరుగులు) రికార్డును బద్దలు కొట్టిన కార్తీక్ (7,451 రన్స్)
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో పార్ల్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన కార్తీక్.. జోబర్గ్ సూపర్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ (53)తో చెలరేగాడు. 39 బంతుల్లో 4 బౌండరీలు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విహాన్ లుబ్బే వేసిన ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సులు బాదాడు.
కాగా, టీ20ల్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును కార్తీక్ అధిగమించాడు. ఇప్పటివరకు కార్తీక్ టీ20ల్లో 7,451 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ఎంఎస్‌డీ (7,432) రికార్డును డీకే బ్రేక్ చేశాడు. 39 ఏళ్ల కార్తీక్ 361 టీ20 ఇన్నింగ్స్‌లలో 26.99 సగటు, 136.84 స్ట్రైక్ రేట్‌తో 7,451 పరుగులు చేశాడు. ఇందులో 34 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 258 సిక్సర్లు, 718 ఫోర్లు కొట్టాడు. అటు ధోనీ 342 టీ20 ఇన్నింగ్స్‌లలో 38.11 సగటుతో 7,432 పరుగులు చేశాడు. ఇందులో 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 517 ఫోర్లు, 338 సిక్సర్లు బాదాడు.