Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. కెప్టెన్ల స‌మావేశం ర‌ద్దు.. ఆ రెండు జట్లే కార‌ణమ‌ట‌!

Champions Trophy 2025 Event For Captains Cancelled Report Claims Complications With Two Teams

  • పాకిస్థాన్‌, దుబాయి వేదిక‌ల‌లో ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
  • ఓపెనింగ్ సెర్మ‌నీకి ముందు జరగాల్సిన కెప్టెన్ల సమావేశం రద్దయిందన్న‌ క్రికెట్ పాకిస్థాన్
  • ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పాకిస్థాన్‌కు 
  • ఈ నేప‌థ్యంలోనే కెప్టెన్ల ఫొటోషూట్ ఈవెంట్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు పేర్కొన్న క్రికెట్ పాకిస్థాన్

పాకిస్థాన్‌, దుబాయి వేదిక‌ల‌లో ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అయితే, ఓపెనింగ్ సెర్మ‌నీకి ముందు జరగాల్సిన కెప్టెన్ల సమావేశం రద్దయిందని క్రికెట్ పాకిస్థాన్ తెలిపింది. తాజా నివేదిక ప్రకారం ప‌లు జట్లు ఆల‌స్యంగా పాక్‌కు వెళ్తుండ‌డంతోనే కెప్టెన్ల ఈవెంట్ రద్దు చేసిన‌ట్లు స‌మాచారం. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పాకిస్థాన్‌కు చేరుకుంటున్నాయని ఐసీసీ వర్గాలను ఉటంకిస్తూ క్రికెట్ పాకిస్థాన్ నివేదిక పేర్కొంది. 

ఫిబ్రవరి 18న ఇంగ్లండ్ లాహోర్ చేరుకోగా, మరుసటి రోజు ఆస్ట్రేలియా చేరుకుంటుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్ర‌వ‌రి 19న‌ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీలోని నేషనల్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ల సమావేశం సాధ్యం కాదని రిపోర్ట్‌ పేర్కొంది.

ఇక భారత్ తన మ్యాచ్‌లను దుబాయిలో ఆడనున్న విష‌యం తెలిసిందే. భారత గ్రూప్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. టీమిండియా త‌న తొలి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 20న బంగ్లాదేశ్‌తో ఆడ‌నుంది. ఆ త‌ర్వాత 23న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. 

కాగా, ఐసీసీతో కలిసి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మ‌నీని ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనుంది. పాక్‌, కివీస్ ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు షెడ్యూల్ చేసిన ఈవెంట్‌ల జాబితాను ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆమోదించారని పీసీబీ వ‌ర్గాలు న్యూస్ ఏజెన్సీ పీటీఐకి తెలిపాయి.

ఇక‌ ఫిబ్రవరి 7న పునర్నిర్మించిన గడ్డాఫీ స్టేడియంను పీసీబీ అధికారికంగా ప్రారంభించనుంది. దీనికి ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అలాగే ఫిబ్రవరి 11న అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వేడుకతో పీసీబీ కరాచీలో పునర్నిర్మించిన నేషనల్ స్టేడియంను ప్రారంభించనుంది.

ఇదిలాఉంటే.. ఓపెనింగ్ సెర్మ‌నీ ఈవెంట్‌ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ లాహోర్‌కు వెళ్తాడా? లేదా? అనేది ఐసీసీ, పీసీబీ ఇంకా ధ్రువీకరించలేదు. కానీ, బీసీసీఐ మాత్రం భార‌త కెప్టెన్‌ను పాకిస్థాన్‌కు పంపించేందుకు సుముఖంగా లేద‌ని ఇప్ప‌టికే ప‌లు క‌థ‌నాలు వెలువ‌డిన విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News