AP High Court: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు

- ‘ప్రజాగళం’ కార్యక్రమంలో కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు హామీ
- ప్రభుత్వం ఏర్పడ్డాక శాసనమండలి, శాసనసభలో బెంచ్ ఏర్పాటుకు తీర్మానాలు
- కర్నూలులో న్యాయమూర్తులు, న్యాయవాదులకు సౌకర్యాలపై కలెక్టర్‌కు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ
- ఒక్క రోజులోనే కోరిన సమాచారం పంపాలని కోరిన వైనం
‘ప్రజాగళం’ కార్యక్రమంలో హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా తొలుత మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేశారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై అభిప్రాయాలు తెలపాలంటూ కాంపిటెంట్ అథారిటీ (హైకోర్టు జడ్జీల-ఫుల్ కోర్టు) ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని కోరుతూ రాష్ట్ర న్యాయశాఖ అప్పటి కార్యదర్శి (ఎఫ్ఏసీ) గతేడాది అక్టోబర్ 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. ఇప్పుడీ విషయంలో మరో అడుగు ముందుకు పడింది.
కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరాం ఈ నెల 29న ఓ లేఖ రాశారు. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అందులో కోరారు. న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి వసతి సౌకర్యాలు వంటి వాటిని వెంటనే తమ ముందు ఉంచాలని, దీనిని అత్యవసరంగా భావించాలని, ఒక్క రోజులోనే కోరిన వివరాలు సమర్పించాలని శివరాం ఆ లేఖలో పేర్కొన్నారు.
లేఖ అందుకున్న కలెక్టర్ ఇదే విషయమై రోడ్లు, భవనాలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీవోలకు లేఖ రాశారు. శ్రీనివాస శివరాం పేర్కొన్న సదుపాయాలతో ఏవైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాలు ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు.