Telangana: యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

- పదవీ విరమణ వయసును 65కు పెంచిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ఉన్నత విద్యా శాఖ పరిధిలో పన్నెండు విశ్వవిద్యాలయాలు
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 60 నుండి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
వాటిలో 2,817 ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 757 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 2,060 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి నెలా ఉస్మానియా, జేఎన్‌టీయుహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాలలో ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రొఫెసర్లు పదవీ విరమణ పొందుతున్నారు.