BJP: బీజేపీ అభ్యర్థి పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ... సోషల్ మీడియాలో వైరల్

Man whose feet Modi touched Ravinder Singh Negi

  • బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి రవిందర్ సింగ్ నేగి పాదాలకు మోదీ నమస్కారం
  • రవిందర్ సింగ్ నేగి పాదాలకు మూడుసార్లు నమస్కరించిన ప్రధాని
  • ప్రస్తుతం పట్‌పర్‌గంజ్‌లోని వినోద్ నగర్ నుంచి కార్పొరేటర్‌గా ఉన్న నేగి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థి పాదాలకు నమస్కరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. నిన్న ఢిల్లీలో బీజేపీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

ఈ క్రమంలో వేదికపై ఉన్న ప్రధాన మంత్రి మోదీ వద్దకు పార్టీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి వచ్చి, ప్రధాని పాదాలకు నమస్కారం చేశారు. వెంటనే ప్రధాని మోదీ అతడిని అడ్డుకుని, రవీందర్ పాదాలకు మూడుసార్లు నమస్కరించారు. 

రవీందర్ సింగ్ నేగి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఉన్నారు. పట్‌పర్‌గంజ్‌లోని వినోద్ నగర్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై పోటీ చేసి, కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 2 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

More Telugu News