Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కుమారస్వామి

- ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్న కుమారస్వామి
- స్టీల్ ప్లాంట్ ను నెంబర్ వన్ ప్లాంట్ గా మారుస్తామని వ్యాఖ్య
- మూడు నెలల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్న కేంద్ర మంత్రి
ఆధునికీకరణ, విస్తరణ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి తెలిపారు. విస్తరణ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు భారంగా మారాయని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభమైన తర్వాత ఉత్పత్తి తగ్గిందని అన్నారు.
ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు రూ. 35 వేల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, ప్లాంట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించి నెంబర్ వన్ ప్లాంట్ గా మారుస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని సమర్థవంతంగా వినియోగించడంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
కార్మికుల సమస్యలను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని, సహకరించాలని కోరానని... దానికి యూనియన్లు అంగీకరించాయని తెలిపారు. 15 రోజుల్లోగా వర్కింగ్ ప్లాన్ ప్రకటిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పటిష్టం చేయడం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని అన్నారు.