AP DGP: రేపు పదవీ విరమణ చేస్తున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు.. తృప్తిగా సర్వీసును ముగిస్తున్నానన్న డీజీపీ

- 35 ఏళ్లుగా పోలీసు సేవలను సంతృప్తిగా అందించానన్న డీజీపీ
- రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని వెల్లడి
- నేరాల రేటు తగ్గిందన్న డీజీపీ
ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు రేపు పదవీ విరమణ చేస్తున్నారు. రాష్ట్ర కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ... తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నానని చెప్పారు. ఏడు నెలలుగా డీజీపీగా పని చేశానని తెలిపారు. 35 ఏళ్లుగా పోలీసు సేవలను సంతృప్తిగా అందించాననే తృప్తి ఉందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. సైబర్ క్రైమ్ తప్ప అన్నీ అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు.
టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్తున్నామని... నేరాల రేటు తగ్గిందని డీజీపీ తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు కూడా 9.5 శాతం తగ్గాయని చెప్పారు. రోడ్ సేఫ్టీ పై ప్రత్యేక దృష్టి సారించామని... దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
సీసీ కెమెరాలను ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామని... ఇప్పటి వరకు 25 వేల కెమెరాలను ఏర్పాటు చేశామని... మార్చి 31 నాటికి లక్ష కెమెరాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. డ్రోన్లను కూడా దాతల సాయంతో అన్ని చోట్ల అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వరదల సమయంలో కూడా పోలీసులు మెరుగైన సేవలు అందించారని ప్రశంసించారు.