Panchumarthi Anuradha: పుంగనూరు ఓటర్ల లిస్టు కంటే... పెద్దిరెడ్డి పాపాల లిస్ట్ పెద్దది: పంచుమర్తి అనురాధ

- పెద్దిరెడ్డి పగలు పూజలు చేస్తూ రాత్రిళ్లు దోపిడీలు చేస్తుంటారన్న అనురాధ
- జగన్ కు తగ్గకుండా అవినీతి చేశారని విమర్శ
- పాడి రైతుల కష్టార్జితాన్ని దోచుకున్నారని మండిపాటు
మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి పగలు పూజలు చేస్తూ, రాత్రిళ్లు దోపిడీలు చేస్తుంటారని విమర్శించారు. జగన్ కు ఏమాత్రం తగ్గకుండా పెద్దిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయాల్సిన పాపాలన్నీ చేశారని... ఇప్పుడు తనకేమీ తెలియదు అంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు.
శాండ్, ల్యాండ్, వైన్ మాఫియాతో వేల కోట్లు కొల్లగొట్టారని అనురాధ విమర్శించారు. శివశక్తి పేరుతో పాడి రైతుల కష్టార్జితాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిన ఘటనలో తనకేమీ సంబంధం లేకపోతే... పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పుంగనూరు ఓటర్ల లిస్ట్ కంటే... పెద్దిరెడ్డి చేసిన పాపాల లిస్ట్ పెద్దదని అన్నారు.
75 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా... ప్యాలెస్ కట్టుకుని, రోడ్డు వేసుకున్నారని అనురాధ విమర్శించారు. రేణిగుంట విమానాశ్రయం దగ్గర పెద్దిరెడ్డి భార్య పేరుతో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్టర్ చేసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి తన అవినీతి సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తం చేశారని అన్నారు.