Deepti Sharma: డీఎస్‌పీగా మ‌రో భార‌త క్రికెట‌ర్‌

Indian cricketer Deepti Sharma appointed DSP in Uttar Pradesh

  • డీఎస్‌పీగా భారత మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఆల్ రౌండర్ దీప్తి శర్మ
  • యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో డీఎస్‌పీగా నియమిస్తూ ఉత్త‌ర్వులు జారీ
  • ఈ విష‌యాన్ని త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియ‌జేసిన మ‌హిళా క్రికెట‌ర్‌

భారత మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఆల్ రౌండర్ దీప్తి శర్మకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స‌ర్కార్ కొలువు ఇచ్చింది. ఆమెను డీఎస్‌పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియ‌మించింది. ఒక క్రికెటర్‌గా దేశానికి ఆమె చేసిన సేవ‌కు గుర్తింపుగా జనవరి 27న యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో డీఎస్‌పీగా నియమిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ విష‌యాన్ని దీప్తి బుధవారం నాడు త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా త‌న‌కు త‌గిన‌ గౌరవం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఫొటోల‌ను పంచుకుంది. 

"ఈ మైలురాయిని సాధించినందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది. డీఎస్‌పీ పోస్టుతో నా చిన్న‌నాటి క‌ల నెర‌వేరింది. అన్ని విధాల నాకు తోడ్పాటు అందించిన‌ నా కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి అచంచలమైన మద్దతు, ఆశీర్వాదాలు ఈరోజు న‌న్ను ఈ స్థాయిలో నిల‌బెట్టాయి. ఈ అవకాశం కల్పించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డీఎస్‌పీగా నా విధులను చిత్తశుద్ధితో నిర్వ‌హిస్తాన‌ని హామీ ఇస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన‌ అందరికీ ధన్యవాదాలు" అని దీప్తి శర్మ త‌న‌ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. 

కాగా, 2024లో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాదీ బౌల‌ర్ మహమ్మద్ సిరాజ్‌ను  డీఎస్‌పీగా నియమించిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు దీప్తి శర్మ ఇటీవలి కాలంలో ఆ స్థానాన్ని పొందిన రెండవ భారతీయ క్రికెటర్ అయింది.

ఇక భారత మ‌హిళా క్రికెట్ జ‌ట్టులో స్పిన్ ఆల్‌రౌండ‌ర్ అయిన దీప్తి శ‌ర్మ గ‌తేడాది వ‌న్డే, టీ20 ఫార్మాట్ల‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. వ‌న్డేలలో టాప్ వికెట్ టేకర్‌గా గ‌తేడాదిని ముగించిన ఆమె.. టీ20లో 30 వికెట్లు సాధించింది. ప్ర‌స్తుతం ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) సమీపిస్తుండటంతో దానికోసం సిద్ధమ‌వుతోంది. 

దీప్తి శర్మ యూపీ వారియర్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఆమె ఈ సీజన్‌లో త‌ప్ప‌కుండా టైటిల్ గెల‌వాలని చూస్తోంది. కాగా, డ‌బ్ల్యూపీఎల్ గ‌త సీజ‌న్‌లో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ (ఆర్‌సీబీ) విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. అంతకుముందు మొద‌టి సీజ‌న్‌లో ముంబ‌యి ఇండియ‌న్స్ టైటిల్‌ను ఎగిరేసుకుపోయింది. 

View this post on Instagram

A post shared by Deepti Sharma (DS) (@officialdeeptisharma)

  • Loading...

More Telugu News