Ambati Rambabu: వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల మాదిరి కొంటున్నారు: అంబటి రాంబాబు

- తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తున్నారన్న పెమ్మసాని
- కేంద్ర మంత్రి పిట్ట కథలను ప్రజలు నమ్మరన్న అంబటి
- టీడీపీ నేతలకు ఎంత దిమాక్ ఉందో చూస్తామని వ్యాఖ్య
వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల మాదిరి కొంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దిమాక్ ఉన్నవాళ్లు ఎవరూ కార్పొరేటర్లను డబ్బులతో కొనరంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. మైకు దొరికిందని అంబటి చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రశేఖర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలో అంబటి స్పందిస్తూ... కేంద్ర మంత్రి చెప్పే పిల్ల కథలు, పిట్ట కథలను గుంటూరు ప్రజలు నమ్మరని అన్నారు. వైసీపీ కార్పొరేటర్లను కొనలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. టీడీపీ నేతలకు ఎంత దిమాక్ ఉందో త్వరలోనే చూస్తామని అన్నారు. వైసీపీ కార్పొరేటర్లతో తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి ఉదయం చెపుతారని... మధ్యాహ్నానికి వాళ్ల మెడలో పసుపు కండువా వేస్తారని మండిపడ్డారు. ఇదేం తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అసాధ్యమని అంబటి అన్నారు. వైసీపీ గెలిపించిన మేయర్ ను గద్దె దించడం టీడీపీ నేతల వల్ల కాదని చెప్పారు. టీడీపీ వాళ్లు ఏదో చేస్తామంటే తాము చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.