Virat Kohli: భద్రతా సిబ్బంది కళ్లుగప్పి కోహ్లీ కోసం మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని... వీడియో వైరల్

- ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్
- ఈ రంజీ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ
- కోహ్లీ కోసం మైదానంలోకి పరిగెత్తుకువచ్చిన అభిమాని.. విరాట్ పాదాలను తాకిన వైనం
అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను కలవడానికి సెక్యూరిటీని కూడా దాటుకుని గ్రౌండ్ లోకి దూసుకొస్తుంటారు. ఇలాంటివి మ్యాచ్‌ల సమయంలో చాలాసార్లు కనిపించాయి. ఇలాంటిదే ఇప్పుడు ఓ రంజీ మ్యాచ్‌లో పునరావృతమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ ఆడుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కోసం ఓ అభిమాని ఇలా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చిన ఆ అభిమాని నేరుగా కోహ్లీ దగ్గరికి పరిగెత్తాడు. ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ వద్దకు పరిగెత్తుకొచ్చిన అతడు.. తన అభిమాన క్రికెటర్ పాదాలను తాకాడు.
అంతలోనే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అభిమానిని అదుపులోకి తీసుకుని మైదానం బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న రైల్వేస్ భోజన విరామానికి 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.