Kumaraswamy: కుమారస్వామి కాన్యాయ్ లో ప్రమాదం... దెబ్బతిన్న జీవీఎల్ నరసింహారావు కారు

- విశాఖ పర్యటనకు వచ్చిన కుమారస్వామి
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళుతుండగా కాన్వాయ్ లో ప్రమాదం
- స్వల్పంగా దెబ్బతిన్న కాన్వాయ్ లోని మూడు వాహనాలు
విశాఖపట్నం పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి కాన్వాయ్ లో తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మలకు ఎయిర్ పోర్టులో ఎంపీలు భరత్, అప్పలనాయడు, ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారి కుమారస్వామి రావడంతో ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ పలికారు.
అక్కడి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళుతున్న సమయంలో కాన్వాయ్ లోని మూడు వాహనాలు ఒకదానితో మరొకటి గుద్దుకున్నాయి. మొత్తం ఎనిమిది వాహనాల కాన్వాయ్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ వాహనాల్లో ఒకటి మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుది కావడం గమనార్హం. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.