Bhumana Karunakar Reddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యంలా బయట పడతారు: భూమన కరుణాకర్ రెడ్డి

- అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు
- విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
- పెద్దిరెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారని భూమన మండిపాటు
అటవీ భూములను మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆక్రమణపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ... పెద్దిరెడ్డిపై పనికట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించకపోయినా... తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు.
ఈ అసత్య ఆరోపణల నుంచి పెద్దిరెడ్డి కడిగిన ముత్యంలా బయటపడతారని భూమన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి నేతలు తమపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు పాత్రికేయ విలువలు పాటించడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.