Virat Kohli: విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్

- శ్రీలంకతో గాలేలో జరుగుతున్న మొదటి టెస్టులో పలు రికార్డులు నమోదు చేసిన స్మిత్
- సెంచరీతో చెలరేగిన ఆసీస్ ప్లేయర్
- స్మిత్‌కు టెస్టుల్లో ఇది 35వ శతకం.. విదేశీ గడ్డపై 17వ సెంచరీ
- తద్వారా కోహ్లీ 16 శతకాల రికార్డును అధిగమించిన స్మిత్
- ఇదే టెస్టుల్లో 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్న స్టార్ బ్యాటర్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ గాలేలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో సెంచరీతో చెలరేగాడు. ఇది స్మిత్‌కు 35వ టెస్ట్ శతకం. అలాగే ఇది అతనికి విదేశీ గడ్డపై చేసిన 17వ సెంచరీ. తద్వారా స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌ల జాబితాలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరు 16 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండేది. తాజాగా స్మిత్ 17వ శతకంతో కోహ్లీని అధిగమించగలిగాడు.
ఇక ఇదే టెస్టులో స్మిత్ మరో అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. టెస్టుల్లో 10వేల పరుగుల మార్క్‌ను చేరాడు. మొదటి రోజు తాను ఎదుర్కొన్న తొలి బంతికే రన్ చేసిన స్మిత్ 10 వేల పరుగుల మైలురాయిని నమోదు చేశాడు.
దీంతో ఈ ఫీట్ అందుకున్న ప్రపంచ దిగ్గజ బ్యాటర్ల సరసన చేరాడు. కాగా, స్మిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లోనే ఈ మైలురాయిని చేరతాడనుకున్నా 9,999 పరుగుల వద్ద ఆగిపోయాడు. ఇక స్మిత్ కంటే ముందు ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
రికీ పాంటింగ్, స్టీవ్ వా, అలెన్ బోర్డర్ అతని కంటే ముందు ఈ ఫీట్ నమోదు చేశారు. దాంతో ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా స్మిత్ అవతరించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన 15వ ఆటగాడు స్మిత్. 35 ఏళ్ల స్మిత్ 115 టెస్టుల్లో 55కు పైగా సగటుతో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. కుమార సంగక్కర కంటే మెరుగైన సగటు (57.40)తో 10వేల పరుగుల ఫీట్‌ను సాధించిన ఏకైక బ్యాటర్ కూడా.
ఈ సందర్భంగా క్రికెట్‌లో 'ఫ్యాబ్ ఫోర్'గా పేర్కొనే విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్‌లపై రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురిలో ఈ తరంలో అత్యుత్తమ ఆటగాడు స్మిత్ అని అన్నాడు.