West Bengal: తరగతి గదిలో విద్యార్ధిని వివాహమాడిన మహిళా ప్రొఫెసర్.. అధికారులు ఏమి చేశారంటే..!

- విచారణ ముగిసే వరకూ సెలవుపై వెళ్లాలని మహిళా ప్రొఫెసర్‌కు ఆదేశాలు
- తన క్లాసులో భాగమైన సైకో డ్రామా ప్రదర్శనగా పేర్కొన్న మహిళా ప్రొఫెసర్
- పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో గల అబుల్ కలాం అజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో ఘటన
తరగతి గదిలో ఒక మహిళా సీనియర్ ప్రొఫెసర్ .. విద్యార్ధిని వివాహం చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలాన్ని రేపింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో గల అబుల్ కలాం అజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో జరిగింది.
నవ వధువులా అలంకరణలో ఉన్న మహిళా ప్రొఫెసర్‌కు, మొదటి సంవత్సరం విద్యార్ధికి నడుమ హిందూ బెంగాలీ వివాహ సంప్రదాయం ప్రకారం.. సింధూర్ దాన్, మాలా బదలా (పూలదండలు మార్చుకోవడం) వంటి క్రతువులు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూనివర్శిటీ బుధవారం విచారణకు ఆదేశించింది.
దీనిపై సదరు మహిళా ప్రొఫెసర్‌ను అధికారులు వివరణ కోరగా, తన క్లాసులో భాగమైన సైకో డ్రామా ప్రదర్శనగా ఈ తతంగాన్ని పేర్కొంది. అయితే విచారణ ముగిసే వరకూ ఆమెను సెలవుపై వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అలాగే సదరు విద్యార్ధికి కూడా ఇదే విధంగా సూచించారు.